13-11-2025 12:00:00 AM
జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 12(విజయక్రాంతి): మిర్చి సాగు పట్ల రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య, మండల వ్యవసాయ అధికారి నవీన్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని పాత్ర పురం గ్రామ సమీపంలోని మిరప తోటలో వారు క్షేత్ర ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి తెగుళ్లు, చీడ పీడల నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి రైతులకు తెలిపారు. ప్రస్తుత తరుణంలో మిరప తోటలకు అధికంగా ఆకుమచ్చ తెగులు వస్తోందన్నారు.
తేమతో కూడిన వాతావరణం, అధిక వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ తెగులు సోకితే ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన్ని రోజులకు ఆకులు పండుబారి రాలిపోతాయని అన్నారు. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. + 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ లేదా 2 గ్రా. పోషామైసిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నవీన్ , ఉద్యాన అధికారి లావణ్య , రైతులు ధనరాజ్, వినోద్ పాల్గొన్నారు.