calender_icon.png 6 November, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

06-11-2025 07:24:46 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, రవాణా, తూనికలు కొలతలు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వానాకాలం 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోలు, ఏర్పాట్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ ధాన్యము కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.

జిల్లాలో అంచనా 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తరువాతే నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, ప్యాడి క్లీనర్లు, డ్రయర్లు, తూకం యంత్రాలు, ట్యాబ్ లు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.

ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని, ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ, వెలుతురు ఇతర ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, వ్యవసాయ, రవాణా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.