06-11-2025 07:28:54 PM
ఆర్ సి ఓ షేరు శ్రీధర్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఆర్.సి.ఓ షేరు శ్రీధర్ అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో అండర్ 17 విభాగంలో అథ్లెటిక్ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఆర్.సి.ఓ షేర్ శ్రీధర్ హాజరై అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల ద్వారా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల ప్రతి సంవత్సరం పాఠశాల,కళాశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు అన్ని రకాల క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారని తెలిపారు. ఈ అథ్లెటిక్ పోటీలలో జిల్లాలోని 12 గురుకుల పాఠశాలలకు చెందిన దాదాపు 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శైలజ, సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, డి డబ్ల్యు వాణి, ఆయా పాఠశాల, కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు,క్రీడాకారులు పాల్గొన్నారు.