06-11-2025 08:43:51 PM
కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం తెలంగాణ ఆర్టిఐ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి సయ్యద్ కలీం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ పౌరులకు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కు ఈ చట్టం కల్పించిందని అన్నారు. ఈ చట్టం ద్వారా పాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు అవినీతిని తగ్గించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో నైనా సమాచారం కోసం భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు సమాచారం అందించడం సంబంధిత శాఖ అధికారులపై ఉంటుందని తెలిపారు. ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ పాలడుగు సునీల్ కుమార్, ఫోరం జిల్లా ప్రచార కార్యదర్శి ఎం నవీన్, సయ్యద్ అబిద్ అలీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.