01-01-2026 02:28:32 AM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీకి అవసరమైన 10.40 లక్షల టన్నుల యూరియాలో ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశామన్నారు.
గత డిసెంబర్‌తో పోల్చితే ఈ డిసెంబర్‌లో రైతులు లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. ఇప్పటీ వరకు 13.89 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు, వీటిలో ప్రధానంగా వరి పంట 3.94 లక్షల ఎకరాలు, మొక్క జొన్న 5.45 లక్షల ఎకరాలు సాగైనట్లు చెప్పారు. యూరియా యాప్ అమలవుతున్న 5 జిల్లాలలో దాదాపు లక్ష మంది రైతులు 3.19 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారని వివరించారు.