17-05-2025 12:53:00 PM
బెల్లంపల్లిలో విషాదం.. మిన్నంటిన రోదనలు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): సొంత ఊర్లో నివసిస్తున్న కొడుకు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వార్తతో తండ్రి తీవ్ర షాక్ గురై మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం నెంబర్-2 ఇంక్లైన్ బస్తీకి చెందిన బొమ్మ కుమార్ సింగరేణి ఏరియా హాస్పిటల్ స్కావెంజర్ గా పనిచేస్తున్నాడు. అతను కొంతకాలంగా పెరాల్సిస్ వచ్చి మంచం పట్టాడు. ఇంతలోనే ఓ పిడుగు లాంటి వార్త ఇంటికి చేరింది. తన కన్న కొడుకు విజయ్ కొత్తగూడెంలో భార్యా పిల్లలతో నివసిస్తున్నాడు.
కొడుకు ఇంటి ముందర చుట్టాల అమ్మాయి మేఘనను ప్రేమ వివాహం చేసుకొని కొత్తగూడెంలోనే స్థిరపడ్డాడు. అతను గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారంతో ఆగ మేఘాల మీద అనారోగ్యం సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకు ప్రత్యేక కారులో వెళుతున్నాడు. వరంగల్ కు చేరుకున్న క్రమంలో కొడుకు మృతి షాక్ నుండి తేరుకోలేని తండ్రి కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. కొడుకు కడచూపును నోచుకోలేక పోయాడు. కొడుకు దగ్గరికి తండ్రి విగతజీవిగా అక్కడికి చేరడం కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచింది.
ఈ సంఘటన అందరిని కలిచివేసింది. తండ్రి, కొడుకులు మృతి చెందిన సంఘటన బెల్లంపల్లిలోనీ ఇంక్లైన్ బస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి, కొడుకుల పార్థివదేహాలను బెల్లంపల్లికి తీసుకొస్తున్నారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి కొడుకుల మృతితో ఆ కుటుంబంలో రోధనలు మిన్నంటాయి. విజయ్ కి అప్పటికే 4 సంవత్సరాల పాప ఉండగా 3 నెలల బాబు ఉన్నాడు. ఇద్దరూ చిన్నపిల్లలే. కాగా అటు తండ్రి ఇటు కొడుకు మృత్యువాతతో రెండు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. హృదయ విధానకరమైన తండ్రి, కొడుకుల మృతి ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.