16-05-2025 11:11:52 AM
గోల్కొండ : హైదరాబాద్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతి కరమైన సంఘటనలో 35 ఏళ్ల వ్యక్తి తన 14 రోజుల కూతురిని హత్య చేశాడు. గోల్కొండ(Golconda) ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జగత్ విశ్వకర్మగా గుర్తించబడిన నిందితుడు ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. బతుకుదెరువు కోసం నేపాల్ నుండి వచ్చిన జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు గోల్కొండ పోలీస్ స్టేషన్(Golconda Police Station) పరిధిలోని ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉండగా, అనారోగ్యంతో కొడుకు చనిపోయాడు.
14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రపోతున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు. గంట తరువాత నిద్ర లేచిన గౌరి పాప ఎక్కడ ఉందని భర్తను అడగగా, చంపేసి గోనె సంచిలో పెట్టానని చెప్పాడు. దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లింది. అదే అదునుగా తీసుకున్న అతను మృతదేహాన్ని సెవెన్ టూంబ్స్ సమీపంలోని చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటనపై గౌరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవజాత శిశువు మరణించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కూతురిని హత్య చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జగత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వెల్లడించారు. విచారణలో అతను నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.