09-09-2025 01:17:23 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలు ఒక గొప్ప వరంలా మారాయి. ఉన్నత విద్యను చదవాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ పథకాలు ఆర్థిక భరోసానిచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా ఈ పథకాలు సమయానికి అమలు కాకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయింది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరుతున్నారు.
వారి ఆశలు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు లోన్లు తీసుకొని చదువు కొనసాగించాల్సి వస్తోంది. బ్యాంకుల వడ్డీలు, ప్రైవేట్ అప్పులు తల్లిదండ్రులకు బరువెక్కిస్తున్నాయి. మరికొంత మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువును మానేయాల్సి వస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు సక్రమంగా జరగలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా విడుదల్లో జాప్యం కారణంగా మొత్తం బకాయిలు వేల కోట్లకు చేరుకున్నాయి.
విద్య అనేది ప్రతి విద్యార్థి ప్రాథమిక హక్కు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ అనేవి దానం కాదు విద్యార్థుల హక్కు. ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేయకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే తక్షణ పరిష్కారాలు అవసరం. పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా విద్యానిధి ఏర్పాటు చేయాలి. దరఖాస్తుల పరిశీలన, నిధుల విడుదలలో పూర్తి పారదర్శకత అవసరం. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ మొత్తాలను సమయానికి విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలి. విద్యార్థుల చదువులతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.
పవన్ సాయి, సిద్దిపేట
యూరియా కొరత లేకుండా చూడాలి
చేగుంట మండలంలో యూరియా కొరత లేకుండా చూడాలి. మూడు రోజుల క్రితం చేగుంట మండలానికి 440 బస్తాల యూరియా వచ్చినప్పటికీ పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో చాలా మంది రైతులు తెల్లవారుజామునే టోకెన్ల కోసం రైతు వేదిక వద్ద బారులు తీరారు. అయితే షాపులో యూరియా ఉన్నా కూడా సరిపడా లేదని.. ఇప్పుడు ఇవ్వడం కుదరదని అధికారులు పేర్కొన్నారు. ఇలా నిత్యం యూరియా కొరత కారణంగా రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇది ఒక చేగుంట మండలంలోనే కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సకాలంలో యూరియా రైతులకు సరఫరా చేయడంలో పారదర్శకతను చూపాల్సిన అవసరముంది.
రుద్రరాజు, చేగుంట