వడదెబ్బతో ఉపాధి మహిళా కూలీ మృతి
- వంగూరు మండలంలో ఘటన
వంగూరు: వడదెబ్బ కారణంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ కూలి మృతి చెందిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఏకు సంధ్య (32) శనివారం ఉపాధి హామీ పనులకు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండల ప్రభావంతో ఆమె అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన తోటి కూలీలు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెకు గ్రామంలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కల్వకుర్తిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఒక కుమారుడు ఉన్నారు. సంధ్య అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎండ వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంధ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






