04-01-2026 12:40:03 PM
విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో(Bhogapuram Airport) తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఎయిరిండియా వ్యాలిడేషన్( టెస్ట్) ఫ్లెట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖపట్నం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త విమానాశ్రయానికి ప్రయాణించారు. కేంద్ర మంత్రి వెంట విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు ఉన్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమైంది. జూన్ లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. ఆరు నెలల ముందే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. 280 కిలో మీటర్లతో వీచే తుపాను గాలులను తట్టుకునేలా విమానాశ్రయం నిర్మించారు. హుద్ హుద్ తుపాణ్ సమయంలో 250 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చిన విషయం తెలిసిందే. హుద్ హుద్ వంటి తుపానులను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయం నిర్మించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2015లో విమానాశ్రయ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. రైతుల నుండి మొదట్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా భూసేకరణలో తలెత్తిన సమస్యల వల్ల ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతానికి, దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికారులు జూన్ 2026 నుండి వాణిజ్య విమానాల సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్నారు.