04-01-2026 11:27:07 AM
హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ పనులు(Rayalaseema Lift Irrigation project) నిలిపివేయించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను ఏపీ తప్పుబట్టింది. తన విన్నపం మేరకు చంద్రబాబు పనులు నిలిపివేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను అసంబద్ధమని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని వివరించింది.
సీమకు రోజుకు 3 టీఎంసీలంటూ ప్రకటనతో జగన్(YS Jagan Mohan Reddy) పనులు చేపట్టారని తెలిపింది. జగన్ ప్రచారంతో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) లిఫ్ట్ పనులపై కోర్టులో కేసులు వేసింది. కేంద్రం, ఎన్ జీటీతో పాటు పలు చోట్లు తెలంగాణ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేనందున పనులు నిలిచిపోయినట్లు ఏపీ వెల్లడించింది. ఎన్ జీటీ, కేంద్రప్రభుత్వం 2020లోనే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చాయని ఏపీ తెలిపింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పనులను కేంద్ర ప్రభుత్వం(Central Government) నిలిపివేసింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని ఏపీ స్పష్టం చేసింది.