6 August, 2026 | 3:14 AM

తైవాన్ పార్లమెంట్‌లో ముష్టి యుద్ధం

19-05-2024 01:54 AM

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఎంపీలు

తైవాన్, మే 18 : చట్టసభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు సర్వ సాధారణమే. అయితే, తైవాన్ పార్లమెంటులో ఇందుకు ఓ రెండింతలు రచ్చ జరిగింది. శుక్రవారం ఉదయం సభ జరుగుతుండగా మాటా మాటా పెరిగి ఎంపీలు తన్నుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యా హ్నం వరకు వాదోపవాదాలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. మధ్యాహ్నం కొంత మేర వివాదం సద్దుమణిగినా తిరిగి మళ్లీ అదే పరిస్థితికి వచ్చింది.

సంస్కరణలకు సంబంధించి శుక్రవారం ప్రవేశపెట్టిన ఓ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బిల్లులో మార్పులు చేర్పులు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశా యి. అంతేకాదు, ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు గాను ఎంపీల కు మరింత అధికారాలు ఇవ్వాలని కోరాయి. పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు చేసే ఎంపీలపై నేరాభియోగాలు మోపేలా ఆ బిల్లులో ఉన్న ప్రతి పాదనలను సైతం వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి గందరగోళం సృష్టించారు. సభ్యులందరూ గొడవ పడుతున్న సమయంలోనే ఓ ఎంపీ బిల్లుల పత్రాలను స్పీకర్ వద్ద లాక్కొని పార్లమెంటు నుంచి బయటకు పరుగులు తీశాడు.