06-01-2026 12:35:57 AM
వివరాలు వెల్లడించిన మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్
మేడ్చల్, జనవరి 5 (విజయ క్రాంతి): కీసరలో సంచలనం సృష్టించిన బంగారం దుకాణంలో దోపిడీ కేసును పోలీసులు చేదించారు. దోపిడీకి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. కేసు వివరాలను మల్కాజిగిరి డిసిపి సిహెచ్ శ్రీధర్ నేరేడుమిట్టిలోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల రెండవ తేదీన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలోని జగదాంబ జువెలరీ షాపులో నకిలీ తుపాకి చూయించి దొంగలు దోపిడీకి యత్నించారు. దుకాణం యజమానిని గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు.
నజీమ్ అజీజ్ కొటాడియా, బిషుకర్మ ఎతేందర్ సింగ్, మహమ్మద్ షేక్ అలీ, రాజేందర్ సింగ్ అలియాస్ రాజసింగ్, రతన్ సింగ్ బహదూర్ ను అరెస్టు చేశారు. వీరి వద్ద బలినో కారు, పల్సర్ బైక్, డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు పాత నేరస్తులు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. రతన్ సింగ్ బహదూర్ పై రౌడీషీట్ ఉంది. ఎస్ ఓ టి డిసిపి రమణారెడ్డి, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి, కీసర ఎస్ హెచ్ ఓ ఆంజనేయులు, ఎస్‌ఓటి ఇన్స్పెక్టర్లు జానయ్య, జలంధర్ రెడ్డి, శ్రీనివాస్, క్లోజ్ టీం ఎస్‌ఐ వంశీ, ఎస్త్స్రలు వాసుదేవ్, సాయి కుమార్, హరి ప్రసాద్, సునీల్ రెడ్డి కేసు చేదన లో పాల్గొన్నారు.