calender_icon.png 7 January, 2026 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి

06-01-2026 12:35:41 AM

  1. వ్యక్తిగా పోతున్నా.. శక్తిగా తిరిగివస్తా
  2. నా పోరాటం ఆస్తికోసం కాదు.. ఆత్మగౌరవం కోసమే 
  3. లక్ష్మీనరసింహ స్వామి మీద, నా కొడుకుల మీద ఒట్టు 
  4. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటనీరు 
  5. రాజీనామా ఆమోదించాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి
  6. రాజ్యాంగ స్ఫూర్తి, నైతికతలేని పార్టీ బీఆర్‌ఎస్

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, ప్రజల తరపున నిలబడి పోరా టంచేస్తూ ఒక రాజకీయ శక్తిగా అవతరి స్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. లెఫ్ట్ పార్టీల సోదరులు, మావోయిస్టు సానుభూతిపరులు, మనుగడ కొనసాగించలేకపోతున్న మావోయిస్టులు, ప్రజా స్వామ్య పద్ధతిలో పనిచేసే పార్టీ రావాలనుకుంటున్న వారు తనకు మద్దతివ్వాలని కోరారు. సోమవారం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులకు బీఆర్‌ఎస్‌లో ఇసుమంత కూడా గౌరవం దక్కలేదన్నారు. పార్టీలో వేలాది పోస్టులు ఉన్నా సరే వారికి పదవులు ఇవ్వాలని గుర్తుకురాకపోవటం విచారకరమన్నారు. ఒకరిద్దరు తనలాంటి వారికే అవకాశం వచ్చిందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.14 లక్ష ల కోట్ల బడ్జెట్ పెట్టి రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండేళ్లుగా మహిళలను, నిరుద్యోగులను మోసంచే స్తోందని విమర్శించారు. పన్నెండేళ్లుగా ఈ రెం డు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ రాని విద్యార్థులు పిడికిలెత్తి పోరా టం చే సేందుకు జాగృతిలో చేరండి, నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు కావాలంటే తనతోపా టు పోరాడండి అని కోరారు. ఆదివాసీ, గిరిజన, దళిత, మైనారిటీ బిడ్డల కోసం పోరాటం చేసే పార్టీ కావాలని, అడబిడ్డగా ముందడుగేస్తున్న తనను దీవించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని బంధా లు, బంధనాలు తెంచుకొని అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కూడా జాగృతిలో చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

నాకు పార్టీ ఏనాడూ మద్దతివ్వలేదు..

అంతకుముందు శాసనమండలిలో కవిత మాట్లాడుతూ, భావోద్వేగానికి గురయ్యారు. కంట తడిపెట్టారు. మొదటి నుంచి తనకు పార్టీ మద్దతివ్వలేదని, జాగృతి తరుపును కార్యక్రమాలు చేప డితే అడ్డుకునేవారన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి తనను కుట్రచేసి బయటకు పంపించారన్నారు. తనది ఆస్తుల పంచాయతీ కాదని, ఆత్మగౌరవ పంచాయతీ అని, ఒక వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నాను.. శక్తిగా తిరిగి వస్తానని ప్రకటించారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలయ్యిందన్నారు. 8 ఏళ్లు స్వతంత్రంగా జాగృతిని నడపానని, జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి నుంచే ప్రయత్నాలు జరిగాయని అన్నా రు. తన వద్దకు కాంట్రాక్టర్లు, పెద్దవాళ్లు, పైరవికారులు రాలేదని, పేదలు, కార్మికులు వచ్చేవారన్నా రు. ఇన్నాళ్లుగా పేదల కోసమే తాను పనిచేశానని, పార్టీ పేపర్లు, ఛానళ్లు నాకు సపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు.

రాజకీయ కక్షలతో తనను జైల్లో పెట్టినా, ఎప్పుడూ కూడా తనకు పార్టీ అండగా నిలవలేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కానిస్టిట్యూషన్ కమిటీ ఎనిమిది పేజీలు ఉంటుందని, అది ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వా మ్యం లేకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 

సెక్రటేరియట్, కొత్త కలెక్టరేట్లలో అవినీతి..

ధర్నా చౌక్ రద్దు చేయడం ప్రజాస్వామిక హ క్కును హరించడమే అవుతుందని, తాను పార్టీలో ఈ విషయం నిలదీసానన్నారు. రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు చేశా రన్నారు. అమరజ్యోతి, సెక్రటేరియట్‌లో, అంబేద్కర్ విగ్రహం, కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణంలో చా లా అవినీతి జరిగిందని, వరదలు వచ్చినప్పుడు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్ల అవినీతి బయటపడిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయమని.. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఇవ్వమని అడిగానని, కానీ తన మాట వినలేదన్నారు.

నేరెళ్ల ఘటనలో ఇసుక దందాతో దళిత బిడ్డలు బలైపోయారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపై చర్యలు తీసుకోవట్లేదని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల ని వంద సార్లు అడిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కింద ఉన్న వ్యక్తులు అనేక దురాగతాలకు పాల్పడ్డారని పరోక్షంగా హ రీశ్ రావును విమర్శించారు. 

హరీశ్‌రావు పెద్ద అవినీతిపరుడు!

జాతీయ ప్రాజెక్టుల విషయంలో బీజేపీ తెలంగాణను పదేపదే మోసం చేస్తోందని, నువ్వు పార్టీ లో ఉండాలి కానీ ఏమీ అడగొద్దు, ఏం మాట్లాడొద్దని తనను కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘోష్ కమిటీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే పార్టీలో ఎవరూ మాట్లాడలేదని, అదే హరీశ్‌రావు, కేటీఆర్ మీద మాట్లాడితే అందరూ మాట్లాడుతారని, కేసీఆర్‌పై మచ్చ వేస్తే తానే జాగృతి తరఫునుంచి ధర్నా చేశానన్నారు. హరీశ్‌రావు పెద్ద అవినీతిపరుడని తాను బయటచెప్పాను, అందుకే తనను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారని, హరీశ్‌రావు పేరు చెప్పిన రెండు గంటల్లోనే తనను సస్పెండ్ చేశారన్నారు.

ఉరితీసే వాళ్లను కూడా చివరి కోరిక ఏంటని అడిగే గొప్ప దేశం మనది, కానీ తనకు నోటీసులివ్వకుండానే అన్యాయంగా పార్టీ నుంచి వెళ్లగొ ట్టారన్నారు. నైతికత, ప్రజాస్వామ్యం లేని పార్టీ నుంచి బయటకు వస్తున్నందుకు తనకు సంతోషంగానే ఉందన్నారు. కాంగ్రెస్ తన సస్పెన్షన్‌ను ఆస్తుల పంచాయితీ అని రాజకీయంగా వాడుకుంటోందన్నారు. ఇది ఆస్తుల పంచాయితీ కాదని, ఆత్మగౌరవ పోరాటమన్నారు. ‘లక్ష్మీనరసింహ స్వామి మీద, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమా ణం చేసి చెబుతున్నా. నాది ఆస్తుల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పోరాటమే’ అన్నారు. 

రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలి

రాజకీయాల్లో మహిళలులేరని, తన రాజీ నా మా తర్వాత మండలిలో ఇద్దరే మహిళలు ఉంటా రని, రాజకీయాల్లో మహిళల శాతం 0.0003 శాతం మాత్రమే ఉందని, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత పెరగాలన్నారు. 17 ఎంపీ స్థానాలుంటే ఒక మహిళ ఎంపీ, 119 ఎమ్మెల్యేలుంటే ఇందులో 8మంది మహిళలు, ఇక మం డలిలో 40 మందిలో ముగ్గురే మహిళలు  ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ వాళ్లు చేసిన తప్పులనే మీరు చేస్తే ప్రజలు మీకూ బుద్ధి చెప్తారన్నారు. తాను వ్యక్తిగా బయటకు వెళ్తున్నా.. కానీ ఒక శక్తిగా తిరిగొస్తానని స్పష్టం చేశారు. 

ఏం పీకి కట్టలు కట్టామని బీఆర్‌ఎస్.. 

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారుస్తామని చెప్పినప్పుడు తాను వద్దని చెప్పానని కవిత తెలిపారు. బీఆర్‌ఎస్ ఏర్పడినప్పడు ఆ సమావేశానికి కూడా తాను హాజరుకాలేదన్నారు. ‘తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని కేంద్రానికి వెళ్లి రాజకీయం చేస్తాం’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టే కంటె పేద ప్రజలను ఆదుకునేది ఉండాల్సిందన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున 20 లక్షల కుటుంబాలు బాగుపడేవన్నారు. కానీ, ఓ బడా కంపెనీకి లక్ష ఐదు వేల కోట్లు బీఆర్‌ఎస్ కట్టబెట్టిందని ఆరోపించారు. నాడు నిజామాబాద్ నుంచి తనను పోటీ చేయాలని పార్టీ అడిగిందని, తాను ఏ నాడూ పదవులు ఆశించలేదన్నారు.

భావోద్వేగంలో.. : మండలి చైర్మన్ గుత్తా

ఇదిలాఉంటే తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్త సుఖేందర్‌రెడ్డిని కవిత కోరారు. దీనిపై గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందిస్తూ కవిత భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని అన్నారు. రాజీనామాపై కవిత పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించారు. భావోద్వేగంలో రాజీనామా నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. దీనిపై కవిత స్పందిస్తూ .. బీఆర్‌ఎస్ నుంచి వచ్చేది తనకు ఏదీ వద్దని.. తన రాజీనామాను అంగీకరించాలని, ఇప్పటికే నాలుగు నెలలు ఆలస్యమయ్యిందని.. తన రాజీనామాను ఆమోదించాలని, తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపి సభనుంచి బయటకు వెళ్లిపోయారు.