18-08-2025 01:23:15 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాలు జలమయమవుతున్నాయి. దీంతో అధికారులు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామానికి వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన ప్రజలు గ్రామం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి ఇళ్లలోకి నీళ్లు చేరిన ప్రజలను గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీలో పలు ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో అధికారులు ట్రాక్టర్ ద్వారా గ్రామానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. గ్రామంలోని పలు కుటుంబాలకు చెందిన ఇళ్లు నీళ్లలో మునిగిపోవడంతో వారు నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులకు వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. మహమ్మద్ నగర్ తహశీల్దార్ సవాయిసింగ్, డిప్యూటీ తహశీల్దార్ క్రాంతి కుమార్, ఆర్ఐ పండరి, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గ్రామానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.