calender_icon.png 18 August, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

18-08-2025 01:21:43 PM

హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి

అభివృద్ధిలో పరుగులు పెడుతున్న హుజూర్ నగర్ నియోజకవర్గం

హుజూర్ నగర్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హుజూర్ నగర్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, తాగునీరు సాగునీరు విద్యుత్,రహదారుల మౌలిక సదుపాయాలకు ఒక యజ్ఞంగా కృషి

రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి...

హుజూర్ నగర్: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓపి బ్లాక్ నూతన విభాగం, ధోబిఘాట్, పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఆస్పత్రిలో నిర్మించిన డయాలసిస్ రక్త నిధి కేంద్రాలను ప్రారంభించారు. అలాగే మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల జీవితాలలో వెలుగులు నింపి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల ప్రజలకు విలువైన వైద్య సౌకర్యాలను ప్రజా ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ధనవంతుడు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటాడని,నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం తమ బాధ్యతని అన్నారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గతంలో హుజూర్ నగర్ లో చిన్న ఆసుపత్రి మాత్రమే ఉండేదని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించిన విషయాన్ని  గుర్తు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు తాను తపస్సులా యజ్ఞం చేస్తున్నానని అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, విద్యుత్, రహదారులలో ప్రగతి సాధిస్తున్నామని ప్రజలు గమనించాలని కోరారు. ఏడున్నర కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాల భవనాన్ని, నాలుగున్నర కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలు మంజూరు కాగా నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.

రామస్వామిగుట్ట వద్ద 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించామని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతన రహదారులను మంజూరు చేయించామని, కృష్ణ, మూసి నదులపై కొత్త లిఫ్టులను మంజూరుతో పాటు, పాత వాటిని పటిష్టం చేస్తున్నామని ఈ పనులన్నీ కొనసాగుతున్నాయని తెలిపారు. మెరుగైన విద్యుత్ కోసం కొత్త సబ్ స్టేషన్ ల మంజూరుతో పాటు, పాత వాటిని పటిష్టం చేస్తున్నామన్నారు. హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఐటీఐతోపాటు, అడ్వాన్సుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని మంజూరు అయిందని, నాలుగు కోట్ల రూపాయలతో కొత్త బస్టాండును మంజూరు చేయించానని తెలిపారు. గరిడేపల్లిలో 250 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయించామని, మట్టపల్లి, జాన్ పహాడ్ పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

యాభై లక్షల రూపాయలతో గుట్ట వద్ద క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ మంజూరు చేయడం జరిగిందని, అలాగే గరిడేపల్లిలో సైతం మంజూరు చేయించామని, గుట్ట వద్దకు రహదారి నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నెలకొల్పాలని తన తపనని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తన్నీరు మల్లికార్జున రావు, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, కోడి ఉపేందర్, కోలపూడి యోహాన్, అనీఫ్, ముస్తఫా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ జయమనోహరి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆస్పత్రి వైద్యులు వనజ,రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.