08-01-2026 01:44:19 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): ఆహారాన్ని కల్తీ చేయడం హత్యాయత్నంగానే పరిగణిస్తామని, ప్రజారోగ్యంతో చెలగాటమాడితే పీడీ యాక్ట్ తప్పదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సీపీ సజ్జనార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలు, గోదాములపైనే దాడులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
దీనికోసం ప్రత్యేకంగా పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించుతున్నట్లు సీపీ ప్రకటించారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. కల్తీ కేసుల్లో ఒకసారి పట్టుబడితే జరిమానాతో సరిపెట్టమని, పదే పదే అదే తప్పు చేస్తే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కల్తీ జరుగుతున్న ట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్-ఫ్రీ నంబర్‌ను తీసుకువస్తున్నట్లు సీపీ తెలిపారు.