31-07-2025 12:00:00 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట/మెదక్, జూలై 30(విజయక్రాంతి): సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కలుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం హవేలీ ఘన్పూర్, పాపన్నపేట మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి ముందుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, తహసిల్దార్ సింధు రేణుక, ప్రజా ప్రతినిధులుతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి, మెదక్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఆ రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి మండలంలో రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. హవేలీఘన్పూర్ మండలంలో అర్హత కలిగిన వారికి 650 రేషన్ కార్డులు అందించడం జరిగిందని, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు 1917 మందికి చేయడం జరిగిందన్నారు.
కూచన్ పల్లి గ్రామంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,33 మందికి ఇవ్వడం జరిగిందని, కొత్తగా కుటుంబ సభ్యుల పేరు నమోదు కొరకు 114 చేయడం జరిగిందన్నారు. అలాగే పాపన్నపేట మండలంలో 479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా కుటుంబ సభ్యుల పేర్ల నమోదు 2342 చేసుకున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 9964 నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా 34,730 కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం జరిగిందని. జిల్లావ్యాప్తంగా 44694 మందికి కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు.