03-08-2025 09:01:14 AM
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్న అధికారులు..
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జునసాగర్(Nagarjuna Sagar) వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. పై నుంచి వస్తున్న వరద దృష్ట్యా అధికారులు కిందకు వదిలే నీటి పరిమాణాన్ని తగ్గిస్తూ పోతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో 6 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం నాగార్జునసాగర్ జలాశయంకు ఇన్ ఫ్లో 1,69,946 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఔట్ ఫ్లో 1,69,946 కూడా అంతే మొత్తంలో కొనసాగుతుంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 585.70 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 299 టీఎంసీలకు చేరుకుంది.
కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు:
నాగార్జున సాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది. జలకళను సంతరించుకొని దిగువకు దిగుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర దళాల ఆధీనంలో..
సాగర్ ప్రధాన డ్యాం పై సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రత కొనసాగుతోంది. కంట్రోల్ రూం వద్ద కూడా సీఆర్‌పీఎఫ్ బలగాలే పహారా కాస్తున్నాయి. ఎస్పీఎఫ్ బలగాలు కేవలం ఎడమ ఎర్త్ డ్యాం, గ్యాలరీలు, ఎడమ కాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయి