03-08-2025 09:07:09 AM
సిఫార్స్ ఉంటే చాలు భారీగా డ్యామ్ మీదకు వాహనాలను అనుమతి
అదే సిఫార్సు ఉంటే మాత్రం ఏ భద్రతా నియమాలు పట్టవు అన్నట్లు వ్యవహార శైలి
సామాన్యులు వెళ్తే డ్యామ్ భద్రత సాకుగా చూపిస్తూ వెనక్కి పంపిస్తోన్న భద్రతా సిబ్బంది
నాగార్జున సాగర్ (విజయక్రాంతి): నాగార్జున సాగర్ డ్యామ్(Nagarjuna Sagar Dam) క్రస్ట్ గేట్లను ఎత్తడంతో ఆ దృశ్యాలను చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. జలాశయం వద్ద పర్యాటకుల తాకిడి మరింత పెరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది కొంతమందిపై పక్షపాతం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రస్ట్ గేట్లను జలాశయం పైకి వెళ్లి చూడాలని చాలా మంది పర్యాటకులు ఆశపడి వెళ్లడం సర్వ సాధారణమైన విషయమే.
డ్యామ్ పైకి అనుమతి లేదని బోర్డు:
నాగార్జున సాగర్ వద్ద సిఫార్సు, పలుకుబడి కలిగి ఉండి ఫోన్ చేయిస్తే సీఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రత్యేక భద్రతా బలగాలు పక్షపాతం వహించే ప్రక్రియకు తెర తీస్తున్నట్లు పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భద్రతా కారణాల రీత్యా డ్యామ్ పైకి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అనే బోర్డు పెట్టి మరీ సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఏకంగా సిఫార్సులకు పర్మిషన్ ఇస్తుంటే నాగార్జున సాగర్ భద్రత ఏమైపోతుందని కొంతమంది పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగర్ ప్రధాన డ్యాం నిర్మాణ సమయం
1955లో సాగర్ ప్రధాన డ్యాం నిర్మాణ సమయంలో ఏపీ-తెలంగాణకు రవాణా మార్గం నిమిత్తం ప్రధాన డ్యాం ముందు బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి 1964లో డ్యాంకు గేట్లు అమర్చక ముందు(1967లో గేట్లుఅమర్చారు) ఎగువ నుంచి వచ్చిన భారీ వరద ఉథృతికి కొట్టుకుపోయింది. దీంతో 1964 నుంచి సాగర్ ప్రధాన డ్యాంపైనుంచే ఏపీ -తెలంగాణకు వెళ్లే భారీ వాహనాలను, ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను కూడా వెళ్లనిచ్చేవారు. ఆ తర్వాత నిపుణులు డ్యాం పటిష్ఠత దెబ్బతింటుందని, డ్యాం పై నుంచి భారీ వాహనాలు వెళ్లరాదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో 2004లో నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయు డు రూ.24 కోట్ల వ్యయంతో ప్రధాన డ్యాంకు కిలో మీటరు దూరంలో నూతన వంతెనన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2005లో వంతెన నిర్మాణం పూర్తి కావడంతో నాటి ఉమ్మ డి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాల సందర్భంగా సాగర్‌కు వచ్చి ప్రారంభించారు. సాగర్ ప్రధాన డ్యాం భద్రత, పటిష్ఠత దృష్ట్యా 2005 నుంచి వాహనాలను అనుమతించకుండా డ్యాంకు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేసి డ్యాంకు 24 గంటలు ఎస్పీఎఫ్ సిబ్బందిచే పహారా ఏర్పాటు చేశారు. అప్పటినుంచి డ్యాంపై పనిచేసే సిబ్బంది వాహనాలు, వీఐపీలు వచ్చినప్పుడు వారి వాహనాలను మాత్రమే డ్యాంపైకి అనుమతించేవారు. గత ఆరు రోజులుగా సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
మంత్రులు వస్తే మీడియాకు నో పర్మిషన్ :
నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు వస్తే మీడియా ప్రతినిధుల వాహనాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. పైగా 2 కిలో మీటర్ల నడక మార్గం ద్వారా మాత్రమే వెళ్లాలనే నిబంధన పెట్టారు. ఇది చాలా దారుణం అని పలువురు మండిపడ్డారు.
ఇలా చేస్తే భద్రతా కారణాలు అడ్డురావా? :
నాగార్జున సాగర్ డ్యామ్ భద్రత బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు అక్కడ ఎవరైనా ఉంటే వారి కుటుంబాలు, బంధువులు, మిత్ర బృందం అందరూ జలాశయం పరిసరాల్లో ఎక్కడైనా సంచరిస్తున్నారు. అదే సమయంలో భద్రతా కారణాల పేరు చెప్పి సామాన్యులను అడ్డుకుంటుండటంతో తెలిసిన వారు ఉండే ఒక లెక్క, లేకపోతే మరో లెక్క ఎందుకంటూ పర్యాటకులు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం వద్ద జరుగుతున్న సిఫార్సుల వ్యవహారంపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.