07-01-2025 12:00:00 AM
బీపీని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఓ ఐదు నిమిషాలు వెచ్చిస్తే చాలంటోంది యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, లండన్ కాలేజీలు చేసి పరిశోధన. ఈ పరిశోధకులు మన రోజువారి కార్యకలాపాలను నిద్ర, కూర్చునే ఉండటం, మెల్లగా నడవటం, వేగంగా నడవటం, నిల్చునే ఉండిపోవడం, వ్యాయామం ఇలా ఆరు రకాలుగా విభజించారు.
ఒక రోజులో సగటున ఏడుగంటల్ని నిద్రకు వదిలేస్తే.. పది గంటలు కూర్చునే ఉంటామనీ, పది నిమిషాలు మెల్లగా నడుస్తూ ఉంటామనీ, ఐదు నిమిషాలు వేగంగా నడుస్తామనీ, పది నిమిషాలు నిల్చుని ఉంటామనీ విశ్లేషించారు. వీటిల్లో కూర్చునే ఉన్నప్పుడు ఓ పదినిమిషాలు, మెల్లగా నడవటం నుంచి ఓ ఐదు నిమిషాలు, నిల్చునే ఉండటం నుంచి ఓ ఐదు నిమిషాలు.. తీసుకుని ఆ సమయంలో చిన్నపాటి వ్యాయామం చేస్తే రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.
ఉదాహరణకి.. మెల్లగా నడుస్తున్నారనుకోండి వేగం పెంచి కనీసం ఐదు నిమిషాలైనా నడవాలి అంటున్నారు. కూర్చునో, నిల్చునో ఉండాల్సి వచ్చిందంటే.. ఓ ఐదు నిమిషాలు వేగంగా నడుస్తారనుకోండి.. దాన్ని పది నిమిషాలు చేయాలి. రోజులో 20 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తుంటే దాన్ని మరో ఐదు నిమిషాలకి పెంచాలి. ఇలా చేస్తే రక్తపోటు అదుపులోకి వస్తుందంటున్నారు పరిశోధకులు.