27-01-2026 01:45:12 PM
జిల్లా విద్యుత్ భవన్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖ యాజమాన్యం ఇచ్చిన అక్రమ సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేస్తూ ఉద్యోగులు, కార్మికులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ భవన్ ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్లను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేసి వేధింపులకు గురిచేయడం అన్యాయమని, శాఖలో పని చేసే ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఇంద్రకల్ గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో లోకేష్ అనే విద్యార్థి మృతి చెందడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు నిరసన చేపట్టడం విశేషం.