06-09-2025 11:26:55 PM
మణుగూరు,(విజయక్రాంతి): అడవుల సంరక్షణ సామాజిక బాధ్యత అని, ప్రతి అటవీ అధికారి అడవులను, పర్యావరణాన్ని రక్షించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) డాక్టర్. సీ. సువర్ణ (ఐ ఎఫ్ఎస్) అన్నారు. శనివారం ఆమె మణుగూరు రేంజ్ పరిధిలోని మనుబోతుల గూడెం సెక్షన్ లో పర్యటించి, ఫారెస్ట్ తోటలను పరిశీలించారు. అనంతరం ఉద్యోగుల నివాస గృహాలను ప్రారంభించారు. అటవీశాఖ అమలు చేస్తున్న హరితహారం, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది, ప్రభుత్వం చేపట్టిన పలు రకాల ప్రాజెక్టులు, పథకాలకు అటవీ అనుమతులు, ప్రత్యామ్నాయ అటవీకరణ పద్దతులను డివిజన్ ఫారెస్ట్ అధికారి సయ్యద్ మాక్సూద్ ఆమెకు వివరించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రోత్సహంతో అటవీ శాఖ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ ప్రధాన సంరక్ష ణాధికారి సువర్ణ మాట్లాడుతూ... అటవీ పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అటవీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కెమెరా ట్రాప్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కదిలికలను గుర్తించాలని సిబ్బందికి సూచించారు.