calender_icon.png 7 September, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మికుల భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

07-09-2025 08:57:13 PM

కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు సోమ గాని మల్లయ్య..

మోతే (విజయక్రాంతి): తమ తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న కల్లుగీత కార్మికుల గీత వనంను ఆక్రమించిన రైతు బండారు ప్రభాకర్ రెడ్డిపై అధికారులు చర్య తీసుకోవాలని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం రావి పహాడ్ ఉమ్మడి గ్రామ అధ్యక్షులు సోమ గాని మల్లయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రావి పహాడ్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని అప్పన్నగూడెం గ్రామంలో ని సర్వేనెంబర్ 285, 287, 296లోని ఎకరం భూమిలో కల్లుగీత కార్మికులు తాటి, ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా కల్లుగీత కార్మికుల  ఆధీనంలో ఈ భూమి ఉన్నదన్నారు. ఇట్టి భూమిపై కన్నేసిన అప్పన్నగూడెం గ్రామానికి చెందిన బండారు ప్రభాకర్ రెడ్డి జెసిబితో తాటి, ఈత చెట్లను తొలగించి అక్రమంగా వరి పొలాన్ని నాటు పెట్టాడని అన్నారు.

జెసిబిని కల్లుగీత కార్మికులు అడ్డుకోవడంతో కొద్ది భాగం మాత్రమే నాటు వేసి మిగతా భాగాన్ని వదిలివేసారని అన్నారు. ప్రభుత్వం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు తరతరాలుగా వస్తున్న భూమిపై హక్కు కల్పించిందన్నారు. దానిలో భాగంగానే ప్రతి సొసైటీలో తాటి, ఈత మొక్కలను పంపిణీ చేసిందన్నారు. మా కులస్తులకు ఇచ్చిన భూమిని అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. 

సిపిఎం సంఘీభావం

కల్లుగీత కార్మికులు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. కల్లుగీత కార్మికుల కు సంబంధించిన భూమిని సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత  కార్మికులు సోమగాని శ్రీహరి, గోపగాని శ్రీను, సోమ గాని దుర్గయ్య, నరేష్, గోపగాని రమేష్, బత్తిని వెంకన్న, నరేష్, కుక్క డప్ప బిక్షం, తండు సతీష్, గోదాల సైదులు, బండి వేణు, సోమ గాని రాము, కారింగుల సతీష్, బత్తిని సాయి, కుక్కడపు గోపి తదితరులు పాల్గొన్నారు.