3 April, 2026 | 3:29 AM

తెలంగాణకు కిషన్‌రెడ్డి ద్రోహం!

03-04-2026 01:42 AM
  • పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం
  • ఏపీకి ఏడు మండలాలను అప్పగించిన ద్రోహం బీజేపీదే
  • కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డి లాగానే విషం కక్కుతారా
  • తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తూ.. తెలంగాణ గొంతు కోస్తారా
  • రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అవమానించారని, ఇది వారి కుట్రకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టుకున్నారని విమర్శిం చారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కిషన్‌రెడ్డి నేడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు.

ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్‌రెడ్డి పేర్కొనడం చారిత్రక అవాస్తవమే కాదు.. తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహమని స్పష్టం చేశారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వమే, ఈ పాపంలో కిషన్‌రెడ్డికి కూడా పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకు సాక్ష్యమని ఆరోపించారు.  పంట పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధమని, వచ్చేందుకు మీకు దమ్ముందా? అని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు.

మీరు క్యాబినెట్ మంత్రిగా ఉండి.. ఏ ప్రభుత్వం అయినా ప్రజాధనంతోనే నిర్మాణాలు చేస్తుందన్న ఇంగితం మరిచి కేసీఆర్ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం మీ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మీ బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదార్లు, ప్రాజెక్టులకు మీ సొంత పైసలు ఖర్చు పెడుతున్నారా?, ఆ పైసలు దుబాయ్‌లో ముద్రిస్తున్నారా? లేక మీ జేబుల్లో నుంచి ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. గతంలో మీ ప్రభుత్వ పెద్దలే నితిన్ గడ్కరీ నుంచి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్ధం అంటారా? అవివేకం అంటారా? అని నిలదీశారు.

ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా’ (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. ‘2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, పథకాలే‘ అని కుండబద్దలు కొట్టిందని గుర్తు చేశారు. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? రేవంత్‌రెడ్డి చెప్పింది మాత్రమే చెవుల్లోకి వెళుతుందా? అని విమర్శించారు. ప్రస్తుతం రాజ్యసభలో పలికింది మీరైనా పలికించింది.. రేవంత్ రెడ్డే అన్నది సుస్పష్టమైందని తెలిపారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని రెప్రెజెంట్ చేయకుండా సప్రెస్ చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు.