05-09-2025 06:51:11 PM
హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి మనుషులు చనిపోతే.. అందులోంచి చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీసే దిక్కు లేదు కానీ ప్రాజెక్టు పూర్తి చేస్తారా..? అని ధ్వజం ఎత్తారు. ఇంత సిగ్గుమాలిన, చేతగాని ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై సీబీఐతో కాదు.. ఎఫ్బీఐతో విచారణ చేసినా భయపడమని అన్నారు. విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చి వారి చేతగానితనాన్ని నిరూపించుకున్నారని.. కాళేశ్వరం పేరుతో బీజేపీతో కలిసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
అసమర్థ ప్రభుత్వం రైతులకు యూరియా అందించలేకపోతుందని, యూరియా కోసం మహిళలు చంటిపిల్లలతో క్యూలైన్లలో అవస్థలు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ రంగం సక్కగ లేదని.. బీఆర్ఎస్ హయంలో ప్రభుత్వ ఆసుపత్రికి పోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అసలు బయటికి వస్తామో లేదో అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను ప్రజలు అడుగుతారని, కొత్త సమస్యలను సృష్టించి.. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులు పోటీపడి కమీషన్లు దండుకోవడంలో ముందున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.