calender_icon.png 5 September, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్‌ రావుపై ఆరోపణలు తగవు

05-09-2025 08:19:35 PM

గుమ్మడిదల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్‌రావుపై చేస్తున్న ఆరోపణలకు అసలు స్థానం లేదని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో హరీష్‌రావు పోషించిన కీలకపాత్రను ఎవ్వరూ మరచిపోలేరని గుర్తుచేశారు. శుక్రవారంనాడు గుమ్మడిదలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఆవిర్భావానికి ముందు జరిగిన ప్రతీ దశలో ఆయన ముందుండి ఉద్యమాన్ని నడిపించారని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ప్రజలకు దగ్గరైన నాయకుడిగా హరీష్‌రావు ఎల్లప్పుడూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేశారని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాల రూపకల్పనలో హరీష్‌రావు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. ఇలాంటి నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం సత్యదూరమన్నారు.

ఇవి ప్రజలు నమ్మే ప్రశ్నే కాదని గట్టిగా అన్నారు. బీఆర్ఎస్‌ బలపడటానికి, ప్రజల మనసులు గెలుచుకోవడానికి హరీష్‌రావు చేసిన కృషి మరువరానిదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన దృఢసంకల్పం, ప్రజలతో కలిసిమెలిసి పోరాడిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. హరీష్‌రావు లాంటి ఉద్యమ సారధులు ఉండడం బీఆర్ఎస్‌కు గర్వకారణం అని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న ఆరోపణలు కేవలం ప్రచారం కోసం మాత్రమే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని ఇది ప్రజలు వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్తారని చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.