calender_icon.png 5 September, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలన కలెక్టర్, ఎస్పీ, శాసన సభ్యులు

05-09-2025 08:40:55 PM

గద్వాల: ఈనెల 6వ తేదీ (శనివారం) డబుల్ బెడ్ రూమ్ గృహాల ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ బి.యం.సంతోష్ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 6వ తేదీ (శనివారం) రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  డబుల్ బెడ్ రూమ్ గృహాల ప్రారంభోత్సవానికి రానున్నందున, అధికారులకు కేటాయించిన పనులను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు 687 మందికి  మంత్రుల చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్లు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు గృహాలు నిర్మించుకునేందుకు రుణాల పంపిణీ, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేయనున్నందున లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులును కార్యక్రమానికి  హాజరు కానున్నందున వారందరు కూర్చునే విధంగా  సిట్టింగ్ ఏర్పాట్లను చేయాలన్నారు. ప్రోటోకాల్ వ్యవహారాలన్నింటినీ సమర్థవంతంగా రెవెన్యూ శాఖ పర్యవేక్షించాలన్నారు.

అధికారులు, సిబ్బందికి కేటాయించిన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ తో పాటు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గృహప్రవేశం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. డబల్ బెడ్ రూమ్ గృహాలలో చేపట్టిన కలరింగ్, ఎలక్ట్రిసిటీ, నీరు, పారిశుధ్య పనులను పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్, రోడ్లు, వేదిక, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, సభా ప్రాంగణం వద్ద పారిశుద్ధ్య పనులను వేగవంతంగా పూర్తి చేసి పరిసరాలను సుందరీకరించాలన్నారు.