05-09-2025 08:35:05 PM
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు. హనుమకొండ రాంనగర్, సుందరయ్య భవన్ లో డీఎస్సీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీ నెరవేర్చడం లేదని, ఇప్పటికీ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్ష మూడుసార్లు నిర్వహించిందని, గత సంవత్సరం డీఎస్సీ నిర్వహించి చేతులు దులుపుకుందని, అప్పుడే మరో ఆరు నెలలో డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులు రావడం వలన రాష్ట్రంలో చాలా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయని, డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వాటికి భర్తీ చేయాలని కోరారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టుల దరఖాస్తును తేదీని పొడిగించాలని, వాటినీ కూడా డిఎడ్ లేదా బీఈడీ చేసిన వారిని అర్హులుగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు.