calender_icon.png 5 September, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో జరిగే ఏ కార్యక్రమం అయినా దేశానికే ఆదర్శం

05-09-2025 05:47:09 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) శుక్రవారం లండన్‌లో బీఆర్ఎస్ ఎన్నారై కేడర్‌ తో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్‌ లోనే అని.. యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ లాంటి పండుగలను ప్రపంచానికి చాటి చెప్పింది కూడా ఇక్కడి నుండే అని, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో మేము నిరసన కార్యక్రమాలు, ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఈ గడ్డపై కూడా చేసింది మీరే అని తెలిపారు. కేసీఆర్(KCR)కి మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మీ అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందని, అప్పుడు దేశంలో నానుడి ఉండేది.. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేదన్నారు. కానీ కేసీఆర్ పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని కాడికి తెచ్చామన్నారు. 

గత 10 ఏండ్లలో గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది పర్‌ క్యాపిటా ఇన్కమ్‌ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందని, పర్ క్యాపిటా పవర్ వాడకంలో ఇండియాలో తెలంగాణ టాప్ అని పేర్కొన్నారు. జీఎస్డీపీ గ్రోత్ లో తెలంగాణ రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నల్ల ద్వారా అందించింది కేసీఆర్ అని తెలిపారు. మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటికి తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని.. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్ళియకపోతే ఓట్లు అడగను అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారని.. మిషన్ భగీరథ కార్యక్రమంతో తెలంగాణ రాకముందు హైదరాబాదులో ఇండస్ట్రీస్‌కి పవర్ హాలిడేస్ ఇచ్చేవారని.. 4 గంటలకు కరెంటు కట్టు ఉండేదని.. గ్రామీణ ప్రాంతంలో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేదన్నారు. అరవై ఏళ్లలో కాని పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చారన్నారు. 

బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసిఆర్ ఉదయం లేవగానే పవర్‌ పై సమీక్ష చేసి పవర్ కొనుగోలు టైమ్స్‌ని చూసేవారన్నారు. తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవాడు అని, డెడికేషన్‌ గా పనిచేసేవారని.. ఫోకస్డ్‌గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని.. పదేండ్లయినా కూడా భారతదేశంలో హర్ ఘర్ జల్ పూర్తి కాలేదు కానీ మూడు ఏండ్లలో మిషన్ భగీరథను పూర్తి చేసుకున్నామన్నారు. మన ఊర్లలో ఉండే చెరువులు ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైందని, చెరువుల్లో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది.. వ్యవసాయం తాగునీరు అందుతాయన్నారు. దాదాపు 30 వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిజిస్టర్ చేసాం.. ఈ కార్యక్రమం మొత్తం దేశం దృష్టినే ఆకర్షించిందన్నారు. కేంద్రం అమృత సరోవర్ కార్యక్రమాన్ని చేపట్టి అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి అధికారులను పంపించిందని.. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు.. అని పేర్కొన్నారు. 

వాచ్మెన్ జాబ్ చేసినా పిల్లని ఇస్తారు కానీ రైతు అని అంటే పిల్లని ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని.. వ్యవసాయం అంటే చిన్నచూపు అయిందని.. అలాంటి పరిస్థితుల నుండి కేసీఆర్ రైతుబంధు అని ఒక కార్యక్రమం చేపట్టి.. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారని హరీష్ రావు అన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి అందించారని.. సాగునీరుని అందించాము దాని ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు. 2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదని.. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా రూ. 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ అని చేపట్టిందన్నారు. విద్యుత్ వినియోగమైనా, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అయినా, ఏ కార్యక్రమమైనా తెలంగాణ దేశానికి ఆదర్శమని అన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండరు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7.7% గ్రీన్ కవర్‌ ని పెంచి ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. గ్రీన్ కవర్ పెంచడం ద్వారా ఓట్లు రావు.. జనరల్‌ గా రాజకీయ నాయకులు పచ్చదనంపై దృష్టి సాధించరు.. కానీ భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని.. అదేవిధంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.