15-02-2026 12:00:00 AM
ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్‌కు లైన్ క్లియర్ కావడంతో.. అవినీతి నిరోధక శాఖ అధికారులు త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల నష్టం
హైదరాబాద్ వేదికగా 2023లో నిర్వహించిన ఫార్ములా--ఈ రేస్ వ్యవహారంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభు త్వ అనుమతులు, క్యాబినెట్ ఆమోదం లేకుండానే విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ తమ దర్యాప్తులో తేల్చింది.
ఛార్జిషీట్‌కు రంగం సిద్ధం -
కేంద్రం నుంచి అనుమతి రావడంతో ఏసీబీ అధికారులు ఈ కేసులో తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2 గా చేర్చారు. అలాగే బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా, ఫార్ములా--ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను ఏ4, ఏ5లుగా పేర్కొన్నారు. ఫార్ములా--ఈ కార్ రేస్ నిర్వహించాలన్నది అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న సొంత నిర్ణయమని, దీనికి ప్రభుత్వ పరంగా సరైన అనుమతులు లేవని ఏసీబీ స్పష్టం చేసింది.
క్విడ్ ప్రో కో.. ఎలక్టోరల్ బాండ్ల లింకు
ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో జరిగిందని అధికారులు నిర్ధారించారు. రేస్ నిర్వహణకు ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగ డానికి ముందే.. బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాం డ్ల రూపంలో భారీగా నిధులు అందాయని తుది నివేదికలో ప్రస్తావించారు. సుమారు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు బీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, త్వరలోనే న్యాయ స్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. తాజా పరిణామం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.