calender_icon.png 26 December, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బంగ్లా’లో మరో హిందూ యువకుడి హత్య

26-12-2025 03:05:12 AM

  1. మైనారిటీలే లక్ష్యంగా దాడులు
  2. గ్రామస్తుల మూకుమ్మడి దాడిలో సామ్రాట్‌కు తీవ్ర గాయాలు
  3. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
  4. గ్యాంగ్‌తో వచ్చి డబ్బులు డిమాండ్ చేయడంతోనే దాడి చేశారంటున్న పోలీసులు
  5. సామ్రాట్‌పై హత్యానేరంతో పాటు మరో రెండు కేసులు
  6. ‘సామ్రాట్ బహిన్’ పేరిట గ్యాంగ్ నడుపుతున్నాడని పోలీసుల అభియోగం
  7. పొరుగుదేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

ఢాకా, డిసెంబర్ 25: బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చం ద్రదాస్ ఉదంతం మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్తులు దారుణంగా కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌బరి జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించింది. డబ్బు వసూళ్లకు పాల్పడడంతో అతడిపై గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు. అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రా ట్‌పై బుధవారం రాత్రి గ్రామస్తులు దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సామ్రాట్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో మృతిచెందాడు. సామ్రాట్ అను చరుల్లో ఒకరైన మోహ్మద్ సెలిమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఒక పిస్ట ల్, షూటర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

క్రిమినల్ గ్యాంగ్ నడుపుతున్నాడని..

అసాంఘిక కార్యకలాపాలు, డబ్బులు వసూలు చేయడానికి ‘సామ్రాట్ బహిన్’ పేరిట అమృత్ మొండల్ ఓ క్రిమినల్ గ్యాంగ్ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. ఒక హత్యానేరంతో సహా అతడిపై రెండు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. షేక్ హసీనా దేశం వీడిన తర్వాత సామ్రాట్ కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్నాడని, ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడని తెలిపారు.

బుధవారం రాత్రే అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లామ్ ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడంతో, కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారని, దీంతో సామ్రాట్‌ను గ్రామస్తులు చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారని తెలిపారు. గ్యాంగ్‌లో ఇతర అనుచరులు పారిపోయారని, మొహ్మద్ సెలిమ్ ఒక్కడే తమకు చిక్కాడని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్‌పై దాడి తర్వాత ఓ మైనారిటీ వ్యక్తిపై మూకదాడి జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.