calender_icon.png 7 May, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు ఉపాయాలు

28-11-2024 12:00:00 AM

ఉపాయాః సామోప  ప్రదాన భేద దండాః..

- కౌటిలీయం -(2-.10.-47)

రాజ్యాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికి ‘సామం, ఉపప్రదానం, భేదం, దండం’ అని నాలుగు ఉపాయాలు ఉన్నాయని చెపుతున్నాడు ఆచార్య చాణక్య. సంప్రదింపులు, చర్చలద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం సామం. సామోపాయంలో ఎదుటివారి గుణగణాలను పొగడడం, సంబంధ బాంధవ్యాలను గుర్తు చేయడం, సమస్య పరిష్కారం వల్ల పరస్పరం జరిగే మేలును చెప్పడం, భవిష్యత్తులో ఇరువురికి జరగబోయే లాభాలను ప్రస్తావించడం, ‘నేను నీ వాడను, నన్ను సంపూర్ణంగా నీవు ఉపయోగించుకోవచ్చునని’ చెప్పడం..

ఇలా అయిదు విధాలను చెపుతున్నాడు చాణక్య. ‘ఉపప్రదానం’ అంటే, సొమ్ము రూపంలో కొంత ముట్ట చెప్పడం. ‘భేదం’ అంటే, మానసికంగా అనుమానాన్ని కలిగించడం లేదా బెదిరించడం. ఇక, ‘దండం’ అంటే, శత్రువును శిక్షించడం. శిక్షించడమూ మూడు విధాలుగా చెప్పాడు. శత్రువును సంహరించడం, బాధించడం, అతని సంపదను హరించడం.

విభేదాలు రాజ్యాలమధ్యే కాదు వ్యాపార సంస్థల మధ్య లేదా ఉద్యోగులు యాజమాన్యం నడుమ కూడా పొడసూపవచ్చు. ఈ సంక్షోభాలను నివారించుకోవడానికి పరస్పర సహకారం, సమన్వయం అవసరమవుతాయి. దానికీ ఈ నాలుగు ఉపాయాలు ఉపయోగపడతాయి. సంస్థలో ఉద్యోగులకు యాజమాన్యానికి మధ్య పొడసూపే అభిప్రాయ భేదాలను సకాలంలో పరిష్కరించుకుంటే ఉద్యోగుల అనుభవం, ప్రతిభా వ్యుత్పత్తులు, నైపుణ్యాలే సంస్థను ఉన్నత పథంలో నడిపిస్తాయి.

సరైన ప్రేరణ, మార్గదర్శనం లభించిన ఉద్యోగులకు పనిలో ఆసక్తి కలుగుతుంది. దాంతో ఉత్పత్తి ఉత్పాదకతలు పెరుగుతాయి. తద్వారా సంస్థ అభివృద్ధితోపాటు ఉద్యోగులకూ భద్రత చేకూరుతుంది. ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం, వారిపై తగిన శ్రద్ధ చూపడం, తగిన విధంగా సరైన సమయంలో సత్కరించడం.. ఇవి ఉద్యోగులకు ప్రేరణ నిస్తాయి. అంతేకాదు, అలసత్వాన్ని ప్రదర్శిస్తే శిక్షించడమూ మిగతా వారికి హెచ్చరికతో కూడిన ప్రేరణ అవుతుంది.

ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని గుర్తిస్తే వారిని పిలిచి మాట్లాడి వారి సమస్య లేమిటో ప్రశాంతంగా విని అర్థం చేసుకోవాలి. సంస్థ ఉన్నతికి వారెలాంటి పరిష్కారం సూచిస్తారో తెలుసుకోవాలి. సమస్య తీవ్రమైంది అయినప్పుడు, అవసరమైతే బయటి నుంచి సలహాదారుల సలహాలు తీసుకునైనా దానిని సకాలంలో పరిష్కరించాలి. అప్పుడు సమస్య మరింత జటిలం కాకుండా ఉంటుంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా పరస్పర భావాలను పంచుకోవడం, అభిప్రాయ భేదాలను తొలగించుకోవడం..

ఒకే లక్ష్యానికై కలిసికట్టుగా పనిచేయడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. దీనినే ‘సామోపాయం’గా చెప్పుకుంటాం. వ్యక్తిగతంగా ఉద్యోగులతో మాట్లాడి వారి ఉన్నతికి అవసరమైన సలహాలను, శిక్షణను అందించడం కూడా సత్ఫలితాన్నిస్తుంది. 

సత్ఫలితాల కోసం..

ఉత్తమ పనితనాన్ని కనబరచిన ఉద్యోగులను సకాలంలో గుర్తించడం, అందరి ముందు సగౌరవంగా సత్కరించడం, ఉన్నత బాధ్యతలను అప్పగించడం, అవకాశం మేరకు పరిమితంగా జీతభత్యాలను పెంచడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. దీనిని ‘దానోపాయం’గా చెప్పుకోవచ్చు. ఎంతగా ప్రేరణనిచ్చినా కొందరు ఉద్యోగులు తమ పనితనాన్ని మెరుగుపరచుకోరు. అలాంటి వారిని ‘భేదోపాయం’ ద్వారా సరిచేయాలి.

ప్రాధాన్యం లేని పనిస్థలాలకు పంపడం, బోనస్‌లలో వివక్షను చూపడం, జీతభత్యాలను తగ్గించడం లాంటి చర్యలవల్ల వారిని మార్చే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ వారు తమ పనితనాన్ని మెరుగుపరుచుకుంటే వారికి మరొక అవకాశాన్నీ ఇవ్వవచ్చు. వారి స్థితిగతులను ఉన్నతీకరించడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ఇక, ఏ ప్రయత్నమూ ఫలవంతం కాకుంటే అలాంటి ఉద్యోగులను సస్పెండ్ చేయడం.. అలాకూడా వారిలో మార్పు రాకపోతే చివరి ప్రయత్నంగా వారిని తొలగించడం వల్ల మిగతా ఉద్యోగులను హెచ్చరించినట్లు అవుతుంది. దీనిని ‘దండోపాయం’గా చెప్పాలి.

ప్రతి వ్యక్తిలో పైకి కనిపించే దానికన్నా అత్యధికమైన శక్తిసామర్థ్యాలు అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటాయి. మంచు పర్వతం సముద్రంలో 15% పైకి కనిపించగా 85% లోపల ఉంటుంది. ప్రతి వ్యక్తికీ ఒకచోట ప్రేరణ కలుగుతుంది. చాలాకాలం ఒకే రకమైన పని చేసినప్పుడు ఆ పనిపై కొంత నిరాసక్తత, ఉదాసీన భావన ఏర్పడవచ్చు. దానిని తొలగించే విధానం ఆలోచించడం వల్ల సమర్థులు, అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మిస్ కాకుండా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నాయకుడు వీలైన మేరకు తన ఉద్యోగుల ఎదుగుదలకు సహకరిస్తూ..

వారి ఉద్యోగ, కుటుంబ జీవితాలను మెరుగు పరుచుకునే విధంగా ప్రేరణను అందిస్తే ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాడు. సంస్థ ఉనికియే ఉద్యోగులకు రక్షణ.. ఉద్యోగుల ఉన్నతియే సంస్థ ప్రగతికి భద్రతనిస్తుంది. 

పాలకుర్తి రామమూర్తి