28-11-2024 12:00:00 AM
మహారాష్ట్ర, పుణే జిల్లాలోని ఖానవలి ప్రాంతంలో జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోకంటే ముందునుంచి నిజాయితీగల గొప్ప నాయకత్వ లక్షణాలున్న ఆలోచనాపరులు, సామాజిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ప్రయోగాలు, ఆలోచనలకు మార్గ నిర్దేశం చేయడానికి ఒక దిక్సూచివలె మహాత్మ జ్యోతిరావు ఫూలే పనిచేశారు.
ఆ రోజుల్లోనే త్యాగం, అంకితభావం, కృషి, పట్టుదల, ఆదర్శం, అభ్యదయం, ఆచరణ వంటివన్నింటికీ ఒక గీటురాయిగా ఉండేవారు. అణచివేతల నుంచి అనేక శ్రేణులు తమ గళాన్ని వినిపించారు. దేశ స్వతంత్ర అంశం ఒక పోరాటరూపం దాల్చగా, అస్తిత్వ ఉద్యమాలు తమ వంతు పాత్రను ద్విగుణీకృతం చేశాయి. అంబేద్కర్‌కంటే ముందే 18వ శతాబ్దిలోనే మహాత్మా ఫూలే, సావిత్రి బాయి ఫూలే దంపతులు తమ కృషిని సాహసోపేతంగా కొనసాగించారు.
మహాత్మా జోతిబా ఫూలే ఆనాడు మహారాష్ట్రలో మహిళాభ్యుదయం, వెనుకబడిన ప్రజల కోసం పని చేశారు. భారతదేశంలో అవిద్య, అసమానతలు, ప్రస్తుత సవాళ్లకు ఆయన ఆలోచనా సరళి, అందులోని మంచిని అమలు చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఇప్పటికీ ఎంతైనా ఉంది. ఫూలె ఆలోచనలు విప్లవాత్మకమైనవి. ప్రాథమిక విద్యను విశ్వవ్యాప్తం చేయడాన్ని ఆయన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు.
అట్టడుగు కులాల ప్రగతి, మహిళా విద్య, అభ్యున్నతికి ఆయన ప్రాముఖ్యం ఇచ్చారు. ఆ సమయంలో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన భార్య మాత సావిత్రి బాయి ఫూలేను ప్రథమ మహిళా గురువుగా తీర్చిదిద్దారు. చాలా గొప్ప సంస్కర్త, విద్యావేత్త, సామాజిక విప్లవకారుడుగా ఆయన చర్రితలో నిలిచారు. మానవ హక్కులకోసం ఘనమైన పోరాటం నడిపిన విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే.
భారతీయులంతా సమానమే అనే భావనకు ఆద్యుడు ఆయన. విద్య అనేది మానవుడికి జ్ఞానద్వారాన్ని తెరుస్తుందని గ్రహించి నిమ్న వర్గాలకు జ్ఞానజ్యోతిని చూపారు. శతాబ్దాలుగా తమకంటూ ఒక ప్రతిష్ఠాత్మకమైన పరిధిని ఏర్పాటు చేసుకొని సమాజంపై పెత్తనం చలాయిస్తున్న ఆధిపత్య వర్గాలతో ఆయన ఒంటరిగా, నిజాయితీగా పోరాడారు. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై వీరి సిద్ధాంతాల ప్రభావం చాలానే ఉంది.
డా. యం. సురేష్‌బాబు