calender_icon.png 19 January, 2026 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులు పారదర్శకమైన, బాధ్యతాయుత పరిపాలనందించాలి

19-01-2026 06:03:57 PM

వరంగల్,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను శ్రీరాముని వలె ఆదర్శంగా పరిపాలిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మంచి పేరు సంపాదించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో జిల్లాలోని 11 మండలాలకు చెందిన నూతన సర్పంచుల కోసం నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.

సోమవారం నిర్వహించిన మొదటి విడతలో భాగంగా గీసుకొండ, సంగెం, చెన్నారావుపేట మండలాలకు చెందిన 84 మంది సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... కొత్తగా ఎన్నికైన సర్పంచులు అన్ని ప్రభుత్వ పథకాల పై సంపూర్ణ అవగాహన ప్రజలకు కల్పించాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకమైన, బాధ్యతాయుత పరిపాలన అందించాలని అన్నారు. గ్రామాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకొని నిరంతరం కృషి చేయాలని,సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, విపత్తుల సమయంలో సర్పంచుల పాత్ర, డిజిటల్ సైన్ వినియోగం,ఆదర్శ గ్రామపంచాయతీల నిర్మాణం వంటి అంశాలపై ఈ శిక్షణలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.విద్య, వైద్యం నిరుపేదలకు అందేలా సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు సామాజిక అభివృద్ధి సాధించే దిశగా పని చేయాలన్నారు. మానవత్వ కోణంతో సేవాభావంతో పాలన సాగించాలని సూచించారు. డిజిటల్ గవర్నెన్స్‌కు అనుగుణంగా పని చేస్తూ సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు.

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వరంగల్ మహానగరం రాష్ట్రంలో రెండో రాజధానిగా అవతరించబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి  పలుమార్లు పేర్కొన్న విషయాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్పంచులు ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ స్మార్ట్ పాలన అమలు చేసి వరంగల్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, టీవోటీలు పాక శ్రీనివాస్, కూచన ప్రకాష్, చంద్రకాంత్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, సర్పంచ్ కూసం స్వరూప రమేష్, మూడు మండలాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.