19-01-2026 05:58:04 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ నుండి ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా వర్గ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్స్, విబి రామ్ జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల రద్దుకై జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో జిల్లాలోని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు భాగస్వాములు కావాలని, ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, విబి జి రామ్ జి చట్టం, బీమా రంగంలోనికి 100శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి, అణు రంగంలోనికి ప్రవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ అణు చట్టం చేసిందన్నారు. వీటికి వ్యతిరేకంగా, 29 చట్టాల స్థానంలో తెచ్చిన ఈ 4 కోట్లను పార్లమెంట్ లో ఉపసంహరించుకునే వరకు సమైక్య ఉద్యమం కొనసాగిద్దాం అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని, రాజ్యాంగంరీత్యా విత్తన చట్టం రాష్ట్రాల పరిధిలోనిదని అన్నారు.
కరీంనగర్ జిల్లా విత్తనాలను 20దేశాలకు ఎగుమతులు చేస్తున్నది. 2004లో రైతు సంఘాల పోరాట ఫలితంగా విత్తన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కానీ కార్పొరేట్ సంస్థలు చట్టం కాకుండా అడ్డుకున్నాయి. ఇంత కాలం కార్పొరేట్ సంస్థల ఒత్తిడి మేరకు విత్తన చట్టం ఆమోదించని కేంద్ర ప్రభుత్వం, వారి కోరిక మేరకు 2025 నవంబర్లో కొత్త విత్తన చట్టం తెచ్చిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా రాజ్యాంగంరీత్యా రాష్ట్ర జాబితాలోనిదని. ఇంత కాలం రాష్ట్రాల పోరాటం వల్ల కేంద్రం చట్టం చేయలేదన్నారు.తదుపరి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ హక్కును దెబ్బతీసే వికసిత్ భారత్ జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలన్నారు. వామపక్షాల పోరాట ఫలితంగా "మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం - 2006" రూపొందింది అన్నారు. దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు రోజుకు 307 రూపాయలు ఇవ్వాలి. దేశంలో మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్రం 10శాతం రాష్ట్రాలు భరించాలి.
ఈ చట్టం ద్వారా కరువుల్లో, కరోనా సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి అజయ్, సిఐటియు నాయకులు ఎడ్ల రమేష్, జి.రాజేశం, కొప్పుల శంకర్, జనగామ రాజమల్లు, ఎం శ్రీలత, రైతు సంఘం నాయకులు సి హెచ్ రాములు, సంపత్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్ సంపత్, మాతంగి శంకర్ మరియు రాయి కంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.