22-08-2025 12:34:06 AM
చెన్నూర్, ఆగస్టు 21 : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్స్టాండ్ వద్ద గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్2 లో పెద్ద ఎత్తున నగదు, బంగారం మాయమైంది. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గురువారం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ నిమిత్తం బ్యాంకును అధీనంలోకి తీసుకున్నారు.
బ్యాంకులో రూ. 80 లక్షలతో పాటు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం మిస్ అయినట్లు బ్యాంకు మేనేజర్ ఆడిట్‌లో గుర్తించారు. దీం తో, బ్యాంకులో తమ అవసరాల నిమిత్తం బంగారం కుదువ పెట్టి లోన్ తీసుకున్నవా రు, బంగారాన్ని బ్యాంకులో ఉంచిన వారు సైతం ఆందోళన చెందారు. తమను బ్యాం కు లోపలికి అనుమతించకపోవడంతో ఖాతాదారులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
బ్యాంకు అవకతవకలపై బ్యాంకు క్యాషియర్ రవీందర్ ను ప్రధాన అనుమానితుడిగా అనుమానిస్తున్నారు. సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచే అతను కనిపించకుండా పోయాడని పోలీసులు ధృవీకరించారు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్‌జా చెన్నూరు ఎస్‌బీఐ బ్రాంచి 2ని సంద ర్శించి పరిస్థితిని సమీక్షించారు.
బ్యాంకు లోపల ప్రతి విభాగాన్ని తనిఖీ చేసి సిబ్బందిని విడివిడిగా ప్రశ్నించారు. అనంతరం విలేకరులతో సీపీ మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎంత మేర అవకతవకలు జరిగా యో విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు.