22-08-2025 02:30:07 PM
హైదరాబాద్: బీజేపీ సచివాలయం(Secretariat) ముట్టడికి పిలుపు దృష్ట్యా పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. మొయినాబాద్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు(BJP Telangana President) ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వస్తుండగా రామచందర్(Ramchander Rao) రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలపై సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, నేను చేవెళ్ల పర్యటనలో ఉన్న సమయంలోనే మొయినాబాద్ వద్ద పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఇది ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అణగదొక్కే ప్రయత్నం మాత్రమే. జీహెచ్ఎంసీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.
రోడ్లు గోతులమయం, ట్రాఫిక్ నియంత్రణ శూన్యం, చెత్త వాసనతో కాలనీలు జీవనానికి నరకం అయ్యాయని ఆరోపించారు. తాగునీటి లోటు, విద్యుత్ సమస్యలు, ఇవి రోజువారీ ప్రజల కష్టాలు. ఇటీవల రామంతపూర్, పాతబస్తీ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ప్రాణాలు పోయిన నిరపరాధులు ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితాలని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ముఖ్యమంత్రిగా కాకుండా ఢిల్లీ పర్యటనలకే పరిమితమైన సీఎం అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ప్రాధాన్యత ప్రజా సేవ కాదు కమీషన్లే అన్నారు. సమస్యలు పరిష్కరించలేని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే కాంగ్రెస్ పాలన తెలంగాణకు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రతి సమస్యపై, ప్రతి వీధిలో ప్రజలతో కలిసి బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నేడు చేవెళ్లలో డ్రాగన్ ఫ్రూట్ సాగును సందర్శించి, రైతులతో ఆయన మమేకం అయ్యారు. వారి సమస్యలను ఆరా తీశారు. భవిష్యత్తు అవకాశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోని సమయంలో, బీజేపీ మాత్రం ప్రతి రైతు కష్టం–భవిష్యత్తు కోసం కట్టుబడి నిలుస్తోందని హామీ ఇచ్చారు.