22-08-2025 03:11:38 PM
- 20 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యం
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మనం స్థిర పడినప్పుడే సమాజం లో గౌరవం లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ నగరం లోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల లో దేశ్‌పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి బ్యాచ్ లో 20 మంది విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ సంఖ్య వచ్చే సంవత్సరం భారీగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న పది సంవత్సరాల్లో 20 వేల మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పించాలనే లక్ష్యంతో ఉన్నాన్నారు. హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉన్న గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే లో ఏర్పాటు కానున్న వేలాది కంపెనీలలో మన మహబూబ్ నగర్ బిడ్డలే ఫస్ట్ ఉండి , ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
దేశ్‌పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు, డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ ఫౌండేషన్ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని ఆయన చెప్పారు. గత సంవత్సరం హుబ్లి లో జరిగిన దేశ్‌పాండే ఫౌండేషన్ వర్క్ షాప్ లో పాల్గొనడం జరిగిందన్నారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి, దేశ్‌పాండే ఫౌండేషన్ వారు ఇచ్చే స్కిల్స్ ను మన మహబూబ్ నగర్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి, పైలెట్ ప్రాజెక్టుగా మన ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను ఎంపిక చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రధానంగా ఈ కళాశాల లో చదువుతున్న విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ దేశ్‌పాండే ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ విద్యార్థులకంటే కూడా మహబూబ్ నగర్ విద్యార్థులకు ట్యాలెంట్ అధికంగా ఉంటుందన్నారు. ఆ ట్యాలెంట్ ను వెలికి తీసేందుకు ఈ దేశ్‌పాండే ఫౌండేషన్ సహాయపడుతుంది అని చెప్పారు.
మీలో రవ్వంత కూడా ఆత్మ విశ్వాసం తగ్గొద్దు : ఎమ్మెల్యే
మీకు గోల్డెన్ ఛాయిస్, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, మీలో రవ్వంత ఆత్మ విశ్వాసం తగ్గకూడదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ శిక్షణ తీసుకుంటే , వారికి చదువు తో పాటుగా ఉద్యోగాలు వందశాతం లభిస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు తనవంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అవసరమైతే విద్యా నిధి నుంచి కూడా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ, కాకతీయ స్యాండ్ బాక్స్ హెడ్ సాహితీ, దేశ్‌పాండే ఫౌండేషన్ రాజపల్లి , శిక్షణ పొందుతున్న విద్యార్థులు , డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.