27 August, 2026 | 5:55 AM

నిరుద్యోగ యువతకు ఉచిత కానిస్టేబుల్ కోచింగ్

27-08-2026 12:04 AM

కొల్లాపూర్ రూరల్, ఆగస్టు 26: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంద రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకుని కొల్లాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ఉచిత కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు.

కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రారంభ తేదీతో పాటు ఇతర పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా కృషి చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బోరెల్లి మహేష్, మానవపాడు నరసింహ, కర్ని శివ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు నాయక్, పసుపుల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.