calender_icon.png 19 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద మహిళకు ఇస్తున్న ఉచిత చీర పంపిణీ...

19-11-2025 08:41:37 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్ : మాజీ దివంగత ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద మహిళకు ఇస్తున్న ఉచిత చీర పంపిణీ కార్యక్రమం వనపర్తి జిల్లాలో  పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎపియం లు, మహిళా సంఘాల అధ్యక్షులను ఆదేశించారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి జిల్లా కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 19న స్వర్గీయ మాజీ ప్రధాని  ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని  కోటి మంది మహిళలకు కోటి  ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.   ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలనీ నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు నుండి డిసెంబర్ 9 లోగ  విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.

ఒక పండగ వాతావరణంలో 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి పేద మహిళకు ఒక్కోక్కటి చొప్పున ఇందిరమ్మ చీర పంపిణీ చేయాలని సూచించారు. మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమ  చేపట్టాల్సిందిగా సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశ్యంతో మహిళలకు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండ వాటికి మహిళలను యజమానులను చేశామన్నారు. స్కూల్స్ లో యూనిఫారం కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించాం,  ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని తెలిపారు.

మహిళ ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన కుటుంబ సర్వే డేటా ఆధారంగా  పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలనీ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది. మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది. వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలనీ, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.

జిల్లాకు 89,516 చీరలు.. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి జిల్లాలో 86,732 మంది మహిళా సంఘం సభ్యులు ఉంటే జిల్లాకు 89,516 చీరలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.  మహిళా సంఘములో లేని వారిని కూడా సంఘంలో చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మరిన్ని చీరలు తెప్పించి ఎలాంటి సమస్యలు లేకుండా  ప్రతి మహిళకు చీర పంపిణీ చేసే విధంగా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డిపిఓ తరుణ్ చక్రవర్తి, డీఆర్డీఒ  కార్యాలయం నుండి అడిషనల్ డిఆర్డీఓ సరోజ, జిల్లా మహిళా సమాఖ్య చైర్మన్ స్వరూప, మండల మహిళా సంఘాల అధ్యక్షులు, ఏపీఎం లు తదితరులు పాల్గొన్నారు.