19-11-2025 09:06:00 PM
న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ కార్యదర్శి నీలం సాయి బాబా
నిజామాబాద్ (విజయక్రాంతి): సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో 19 నవంబర్ 2025న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న చంద్ర పుల్లారెడ్డి 41వ స్మారక సభకు నిజామాబాద్ నగరం నుండి కార్యకర్తలు బయలుదేరారు. నిజామాబాద్ నగర కమిటీ కార్యదర్శి నీలం సాయిబాబా ఆధ్వర్యంలో ఈ బృందం హైదరాబాద్లో కార్యక్రమానికి హాజరుకానుంది. భారతదేశంలో విప్లవోద్యమానికి జీవితాంతం కృషి చేస్తూ, అనేక రచనలు చేసిన సిపి రెడ్డి జీవితం విప్లవకారులకు స్ఫూర్తిదాయకమని నీలం సాయిబాబా అన్నారు. ఇంజనీరింగ్ చదువు వదిలి స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని, సామాజిక మార్పు కోసం కృషి చేయడమే నిజమైన జీవితమని భావించి శ్వాస ఉన్నంతవరకు సమరం కొనసాగించిన ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమే నేడు ప్రజలు అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తూ, ప్రజా ఉద్యమాలను నిర్బంధిస్తుందని, ప్రజాస్వామిక గొంతులకు కళ్లెం బిగుస్తోందని ఆయన సాయిబాబా అన్నారు. మానవ సమాజములు ఘర్షణ అనివార్యమని ప్రకృతి ధర్మమని, పుట్టుక చావు సహజమని నిర్ధారణ అయిందని ఆయన అన్నారు. ప్రజలకు భూమి, భుక్తి, విముక్తి కోసం విప్లవోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అమరవీరుల స్వప్నాన్ని సాధించుటకు సీపీ రెడ్డి స్మారక సభ మరింత తోడ్పడుతుందని అన్నారు. సిపి రెడ్డి స్మారక సభలో పాల్గొనడానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు రమేష్ మల్లికార్జున్ గంగాధర్ దాసు సాయిలు వీరయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు.