calender_icon.png 19 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శకుడు రాజమౌళిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

19-11-2025 09:03:18 PM

హనుమకొండ (విజయక్రాంతి): వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా శ్రీ హనుమంతుడిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో బిజెపి నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అనంతరం హనుమకొండ బీజేపీ జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజమౌళి గతంలో తన చిత్రాల్లో దేవతలను ప్రతిష్ఠాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకుల ఆదరణను, ప్రజల భక్తిని లాభాల కోసం వినియోగించుకున్నారని, అయితే ఇప్పుడు అదే హిందూ దేవుళ్ల గురించి అనుచితంగా వ్యాఖ్యానించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసే ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎవరూ చేయకుండా నిరోధించేందుకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం చట్ట విరుద్ధమని, దానికి అనుగుణంగా రాజమౌళి పై సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి హన్మకొండ జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి, బిజెపి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగం సాగర్, ఎడ్ల నవీన్, బండి సదానందం తదితరులు ఉన్నారు. కేసు విషయమై వివరణ కోరగా న్యాయపరమైన నిర్ణయాలు తీసుకొని కేసు నమోదు చేస్తామని సుబేదారి సిఐ రంజిత్ కుమార్ తెలిపారు.