calender_icon.png 19 November, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభాకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ అవసరం..

19-11-2025 08:39:19 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్: వనపర్తి మున్సిపాలిటీని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ అవసరమని, దాని రూపకల్పన కోసం సంబంధిత శాఖల అధికారులు, స్టేట్ హోల్డర్లు అవసరమైన వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో డీటీసీపీ అదనపు సంచాలకులు, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్విని, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి సంబంధిత శాఖల అధికారులకు, పట్టణంలోని లైసెన్సుడు టౌన్ ప్లానర్లకు వనపర్తి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొదటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ అవసరమని అన్నారు. అమృత్ 2.0 పథకం కింద వనపర్తి మున్సిపాలిటీ లో జీఐఎస్( భౌగోళిక సమాచార వ్యవస్థ ) ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్దవంతంగా చేపట్టాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన సమాచారం వివిధ శాఖలు 15 రోజుల్లో  అందించాలన్నారు. పట్టణ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని, రాబోయే 20 ఏళ్ళ వరకు భవిష్యత్తు అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలని తెలిపారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్ అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇండ్లు, త్రాగునీరు, రహదారులు, ఇతర సదుపాయాలు ప్రణాళికాబద్ధంగా అందించాల‌న్నారు.

డిటిసిపి అదనపు సంచాలకులు మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం కింద 50 వేల నుంచి 90 వేల జనాభా కలిగి ఉన్న వనపర్తి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలు కోసం గత ఏడాది నవంబర్లో డ్రోన్ ఫ్లై తో పాటు, సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టడం జరిగిందని చెప్పారు. మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలకు బట్టి మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ముఖ్యమని తెలిపారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం సంబంధిత శాఖల అధికారులు 15 రోజుల్లోగా వనపర్తి మున్సిపల్ కమిషనర్ కు నిర్దేశించిన ఫార్మాట్ లో సమాచారాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, లైసెన్సు టౌన్ ప్లానర్లు పాల్గొన్నారు.