24-07-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై23(విజయక్రాంతి): మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం వారికి దక్కిన అసలైన గౌరవమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు హా జరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది విద్యార్థులు, చిరు ఉద్యోగులు, కూలీలు, పట్టణంలో పాలు కూరగాయలు అమ్ముకునే మహిళలకు ఎంతగానో ఆర్థిక వెసులుబాటును కల్పించిందని అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఖర్చు ఆదా చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. అద్దె బస్సుల విధానం ద్వారా మహిళలకు ప్రతినెలా ఆదాయం సమకూరుతోందని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత పథకాలు అమలు చేస్తూనే వారిని ఆర్థిక సాధికారత దిశగా తీసుకెళ్తున్నందుకు సాటి మహిళగా ఎంతో సం తోషంగా ఉందని అన్నారు. కరీంనగర్ రీజియన్ లో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 4 కోట్ల 83 లక్షల ప్రయాణాలు చేశారని, 201.82 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని తెలిపారు. ఆర్టీసీ బస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుం డి కలెక్టరేట్ వరకు ప్రయాణించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి రాజు, అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి, డిపో మేనేజర్ విజయ మాధురి ఇతర అధికారులుపాల్గొన్నారు.