‘భావ ప్రకటన’కు భంగం కలగదు
- మంత్రి పొన్నం ప్రభాకర్
- అసెంబ్లీలో ‘హెట్ స్పీచ్’ బిల్లు
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ప్రభుత్వం తీసుకొస్తున్న విద్వేష పూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాలను నివారించే హెట్ స్పీచ్ బిల్లు ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో హెచ్ స్పీచ్ బిల్లును పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యుల లేవనెత్తిన సందేహాలపై ఆయన మాట్లాడారు. మానవ హక్కులను హరించే విషయాలు ఈ బిల్లులో లేవని స్పష్టం చేశారు.
కక్ష సాధింపు కోసమో, ఎవరికో అన్యాయం చేసే ఉద్దేశం లేదన్నారు. ఈ బిల్లు విషయంలో విపక్ష సభ్యుల ఆలోచనలో పొరపాటు ఉన్నదని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం తప్పు అన్నారు. ఈ బిల్లులోని అంశాలు అందరికీ వర్తిస్తాయన్నారు. ఇటీవలి కాలంలో విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల ఘటనలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రేరేపితమవుతున్న ఈ ఘటనలు సామాజిక మాధ్యమాల ద్వారా మెరుపు వేగంతో వ్యాపించి, ప్రజా శాంతిభద్రతలకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని తెలిపారు. అందుకే అలాంటి ప్రవర్తనను సమర్థవంతంగా నివారించడానికి, నియంత్రించడానికి, శిక్షించడానికి, అలాగే బాధితులకు రక్షణ, పరిహారం అందించడానికి ఒక ప్రత్యేకమైన, పటిష్టమైన చట్టం అవసరముందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికే హానికరం: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
శాంతిభద్రతల పేరుతో తీసుకువస్తున్న హేట్ స్పీచ్ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి హానికరం అని బీజేఎల్పీ నేత ఏలే టి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ బిల్లులోని శిక్షలకు ముందస్తు బెయిల్ ఉండదని, రాజకీయ ప్రత్యర్థులను నియంత్రించేం దుకు తీసుకువస్తున్న ఈ బిల్లు ప్రస్తుతం బాగానే అనిపించవచ్చని, కానీ అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి రాగానే ఈ బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉందన్నారు.
బతికున్నవారిమీదనే భరోసా లేని ఈ సమాజంలో చనిపోయిన వ్యక్తుల మీదనో, నిజాం పాలకుల మీదనో, మరెవరో రచయితల మీదనో మాట్లాడినా కూడా కేసులు పెట్టేలా నిబంధనలు ఇందులో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి చట్టాలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారు. ఇందులోని సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ లాంటిదన్నారు. ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్ వేసే పోస్టుకు గ్రూప్‌లోని సభ్యులందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదన్నారు.
ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇది రాజకీయాలతో సంబంధించినదని కాదని, భావ స్వేచ్ఛ, భాషా, కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగాలపై అన్ని రకాలుగా దాడు లు చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
బ్రిటీష్ కాలంలో ఇటువంటి బిల్లులు ఉండేవని ఈ బిల్లులో సరైన స్పష్టం తేలదన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రజాస్వా మ్యం బంధీగా ఉన్నదని, దీనికి తోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడైతే ఇక చెప్పుకోవడానికి ఏమీ ఉండదన్నారు. ఉపా చట్టం కింద ఎవరినైనా ఎప్పుడైనా లోపల పెడుతున్నారు. ఎన్‌ఐఏ ఎవరినైనా అరెస్టు చేస్తున్నారు.




