03-05-2025 07:56:17 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కేంద్రమంత్రుల పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఏఎస్పీ చిత్తరంజన్ లతో కలిసి కేంద్ర మంత్రుల పర్యటన, ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 4 వరుసల జాతీయ రహదారి - 363 ను ఈ నెల ఐదవ తేదీన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఇతర కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభిస్తారని, ఈ నేపథ్యంలో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో హెలిపాడ్, బహిరంగ సభ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర మంత్రుల పర్యటనలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, విధులు కేటాయించిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, హెలిపాడ్, సభాస్థలి వద్ద బందోబస్తు ఏర్పాటు, వేదిక అలంకరణ, ప్రముఖుల గ్యాలరీ, మీడియా గ్యాలరీ, అనుమతి పాసులు జారీ, వాహనాల పార్కింగ్, కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు అల్పాహారం, త్రాగునీరు, సభకు వచ్చే ప్రజలకు భోజనం, త్రాగునీరు ఎలాంటి రద్దీ లేకుండా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, కేంద్ర మంత్రుల పర్యటన ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.