13 July, 2026 | 9:14 AM

మన ఇంజినీరింగ్ విద్యకు ఫుల్ డిమాండ్!

03-05-2024 01:12 AM

అగ్రికల్చర్, ఫార్మీసీ విద్యకూ అంతే డిమాండ్ 

తెలంగాణ ఎప్‌సెట్‌పై ఏపీ విద్యార్థులు ఆసక్తి

భారీగా దరఖాస్తు చేసుకున్న ఏపీ అభ్యర్థులు

నాణ్యమైన విద్య, ప్రాంగణ నియామకాలే కారణం

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రిల్చర్ విద్యకు ఫుల్ డిమాండ్  ఏర్పడింది. ఈ ఏడాది తెలంగాణ ఎప్‌సెట్ (గతంలో ఎంసెంట్)కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. టీఎస్ ఎప్‌సెట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఏపీ విద్యార్థులు సైతం మక్కువ చూపిస్తున్నారు. కేవలం ఇంజనీరింగ్ విద్యనే కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ విద్యనభ్యసించడానికి సైతం మన విద్యార్థులతో ఏపీ విద్యార్థులు పోటీపడుతున్నారు. టీఎస్ ఎప్‌సెట్‌కు తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 3,54,803 (ఏప్రిల్ 29 వరకు) దరఖాస్తులు రాగా వాటిలో ఏపీ నుంచే 61,420 దరఖాస్తులున్నాయి. 49,071 మంది ఏపీ విద్యార్థులు ఇంజనీరింగ్‌కు, 12,349 మంది అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గతేడాది ఇంజనీరింగ్‌కు 51,461 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 20,743 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 వేల దరఖాస్తులు తగ్గినట్లు దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. కాగా, మే 1న ఎప్‌సెట్ దరఖాస్తుల గడువు ముగిసింది.  మే 7,8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు జరగనున్నాయి.

నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు

తెలంగాణలో అనేక కళాశాలలు మంచి విద్యాప్రమాణాలతో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలూ మెండుగా లభిస్తుండడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇటు వైపు చూస్తున్నారు. అందుకే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి విద్యనభ్యసించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. హైదరాబాద్‌లో అధికంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండడంతో కోర్సు పూర్తయిన వెంటనే ఇక్కడే ఉద్యోగం చేయొచ్చనే భావనతో ఏపీ విద్యార్థులు ఇక్కడ చదివేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేస్తే మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు సైతం భావిస్తున్నారు. అందుకే సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సులకు మన దగ్గర ఫుల్ డిమాండ్  ఏర్పడింది. మెజార్టీ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందుబాటులో ఉండటం కలిసొస్తుంది.