26-07-2025 01:04:56 AM
నాగర్‌కర్నూల్/గద్వాల/నిర్మల్/భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (విజయక్రాంతి)/నాగార్జునసాగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా వివిధ ప్రాజెక్టులలో నీటి మట్టాలు పెరుగుతున్నాయి.
కర్ణాటకలోని జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 80 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 1,49,526 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 882.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం నుంచి నీటితో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 579 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 279 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 120635 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 6598 క్యూసెకులుగా కొనసాగుతుంది. సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 511 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 3,972 క్యూసెక్కులు, ఎస్‌ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కడెం ప్రాజెక్టులోకి స్వల్ప వరద
నిర్మల్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులో వరద నీరు ఆశించిన స్థాయిలో రాకపోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గత ఏడాది కంటే తక్కువగా నమోదు అవుతుంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 10.91 అడుగులు(90) టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.68(21) టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సీజన్‌లో 10.71(29 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గోదావరి పరిహాక ప్రాంతమైన మహారాష్ట్రలో భారీ వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి స్వల్పంగా 26.05 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగులకు చేరుకుంది.
కిన్నెరసాని, తాలిపేరు జలాశయాల్లోకి వరద
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాలేరు, వైరా, కిన్నెరసాని, తాళి పేరు జలాశయాల్లో కి వరద నీరు వచ్చి చేరుతోంది. వైరా జలాశయం పూర్తిస్థాయికి మించి ప్రవహిస్తుంది, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు చేరుకుంది. సింగభూపాలెం చెరువు అలుగు పారుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాశయం నుంచి 2 గేట్లుఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపనున్నట్లు జెన్కో అధికారులు ప్రకటించారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుత జలాశయం నీటిమట్టం 404.40 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాళిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 22, 992 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు 7 గేట్లు ఎత్తి 24,905 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
పెరుగుతున్న గోదావరి ఉధృతి
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. గురువారం సాయంత్రం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు 26 అడుగులకు చేరుకొని ఇంకా పెరుగుతూనే ఉన్నది. గోదావరి ఎగువన ఉన్న పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. భద్రాచలం వద్ద నీటిమట్టం 26 అడుగులకు చేరుకోవడంతో 9,32,288 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది.