26-07-2025 01:02:26 AM
- సీఎస్‌ఈ, ఐటీ కోర్సుల్లోనూ మిగులుతున్న సీట్లు
- సివిల్, మెకానికల్ కోర్సులను పట్టించుకోని వైనం
- ప్రతిఏటా మేనేజ్‌మెంట్, కన్వీనర్ కోటాలో నిండని సీట్లు
- వీటిలో సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ సీట్లే ఎక్కువ
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు పూర్తిస్థాయిలో నిండడంలేదు. చాలా కాలంగా బీటెక్‌లో సీట్లు మిగులుతున్నాయి. కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు సైతం ఖాళీగానే ఉండిపోతున్నాయి. ప్రతి ఏటా దాదాపు ఇరవై వేలకుపైగా సీట్లు నిండడం లేదు. ఇందులో కన్వీనర్ కోటాలోనే 5 నుం చి 8 వేల వరకు సీట్లు ఖాళీగా ఉంటున్నా యి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లోనే కాదు సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లోనూ సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ ఏడాదైనా సీట్లు నిండుతాయా లేదా అనే అనుమానాలే వ్యక్తమవుతున్నా యి.
ఒకవైపు సీట్లు పూర్తిగా నిండే పరిస్థితిలేదు. మరోవైపు సీట్లను పెంచాలని కాలేజీ లు కోరుతుండడం గమనార్హం. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు మిగులుతున్నాయంటే అనుకోవచ్చు, కానీ డిమాండ్ ఉండే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సుల్లోనూ సీట్లు పెద్ద సంఖ్యలో మిగులుతున్నాయి. కాలేజీ, కోర్సులకుండే డిమాండ్‌ను బట్టే సీట్లు నిం డుతున్నాయి. చిన్నాచితకా కాలేజీల్లో పెద్దగా సీట్లు నిండడంలేదు. యూనివర్సిటీ, అటానమస్ కాలేజీలనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుటున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే కోర్సుల్లోనే జాయిన్ అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. ఈక్రమంలో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి.
నాటి నుంచే
2020 180 కాలేజీలుండగా, వీటిలో మొత్తం 98,988 సీట్లున్నాయి. అ యితే వీటిలో కేవలం 65,720 సీట్లు మాత్ర మే నిండాయి. అంటే ఆ ఏడాది 33,268 సీట్లు మిగిలాయి. అలాగే 2021 మొత్తం 175 కాలేజీల్లో 1,09,773 సీట్లకు భర్తీ అయినవి మాత్రం 77,700 మాత్రమే. ఈ ఏడాది 32,073 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2020 2021 నాటికి కాలేజీల సంఖ్య తగ్గినప్పటికీ సీట్లు నిండలేదు. అదేవిధంగా 2022 విద్యాసంవత్సరంలో 1,08,715 సీట్లలో 82,350 నిండగా, 26,365 సీట్లు మిగిలిపోయాయి. 2023 24 ఏడాదిలో గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా సీట్ల సంఖ్యను పెంచారు.
1,17,426 సీట్లకు 91,001 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 26,425 సీట్లు అలాగే మిగిలిపోయాయి. ప్రస్తుత 2024 విద్యా సంవత్సరంలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,12,069 సీట్లకూ పూర్తి స్థాయి లో నిండనేలేదు. కోర్ బ్రాంచిల్లో 8,291 సీట్లు, సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ బ్రాంచీల్లో 3,625 సీట్లు మిగిలాయి. ఈ విద్యాసంవత్సరం కూడా సుమారు 20 వేల వరకు సీట్లు మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 రెండో విడత సీట్లను ఈనెల 30న కేటాయించనున్నారు. ఈ విద్యాసంవత్సం పక్కనబెడితే 2020 నుంచి 2024 వరకు సుమారు 1.40 లక్షల సీట్లు మిగిలినట్లు తెలుస్తోంది.
కోర్‌పై మక్కువ పెంచేలా
ఏ కోర్సుల్లోనైతే విద్యార్థులు చేరడం లేదో ఆ కోర్సులపై అధికారులు దృష్టిసారించి వాటిని విద్యార్థులు ఎంచుకునేలా ప్రోత్సహించాలి. సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సులు చేస్తేనే మంచి ప్యాకేజీలతో ఉద్యోగవకాశాలు లభిస్తాయనే అపోమను విద్యార్థుల నుంచి తొలగించాల్సి ఉంటుంది. అందుకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సులపై అవగాహనను కల్పించాల్సి ఉంటుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ విద్యాసంవత్సరం ఇలాం టి ప్రయత్నమే చేసింది.
అయితే ఈ ఒక్క ఏడాదితో సరిపెట్టకుండా ప్రతి ఏడాది కౌన్సెలింగ్‌కు ముందు విద్యా నిపుణులు, పారిశ్రా మికవేత్తలతో అవగాహన సదస్సులను నిర్వహిస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు సివిల్, మెకానికల్, ఈఈఈ సీట్లను సీఎస్‌ఈకి మార్చుకోకుండా కాలేజీల యాజమాన్యాలను నియంత్రించాల్సి ఉంటుంది. సీఎస్‌ఈ, అనుబంధ సీట్లు పెరుగుతుంటే.. సివిల్, మెకానికల్, ఈఈఈ సీట్లు తగ్గుతున్నాయి. దీంతో గత కొన్నేళ్లుగా ఈ కోర్సులు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. దీని ప్రభావం భవిష్యత్ అవసారాలపై తీవ్రంగా పడబోతోందని అధికారులు చెబుతున్నారు.
ప్రతీ ఏటా భారీగానే మిగులు
ప్రతి ఏడాది ఇంజినీరింగ్ సీట్ల కౌన్సెలింగ్‌ను మూడు విడుతల్లో చేపడుతున్నారు. అయినా అన్ని సీట్లు నిండడంలేదు. తొలివిడతలోనే పెద్ద సంఖ్యలో సీట్లు నిండుతుంటే రెండు, మూడో విడతల్లో పూర్తి స్థాయిలో సీట్లు నిండడంలేదు. ఈ విద్యాసంవత్సరంలో 172 కాలేజీల్లో మొత్తం 1.14 లక్షల సీట్లలో 83,054 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నా యి.
అయితే తొలివిడతలో 83,054 సీట్లలో 77,561 సీట్లను కేటాయించగా, అందులోనూ కాలేజీల్లో చేరింది 59,980 మంది మాత్రమే. అంటే 17,581 మంది సీట్లు వచ్చి నా చేరలేదు. అంతేకాకుండా తొలివిడత ముగిసేవరకు 5,493 కన్వీనర్ కోటా సీట్లు మిగిలాయి. దీనికి అదనంగా ఈనెల 24న 7,650 బీటెక్ అదనపు సీట్లకు ప్రభు త్వం అనుమతులిచ్చింది. ఇందులో 70 శాతం సీట్లు అంటే 5,355 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలినవి మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తారు.